Revanth Reddy Press Meet About ktr: సీఎం కేసీఆర్ తన ధన దాహంతో దశాబ్దాల చరిత్ర కల్గిన హైదరాబాద్ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహీల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర అక్రమ కట్టడాలకు అనుమతులిస్తున్నారని విమర్శించారు. జూబ్లీహీల్స్ చెక్ పోస్ట్ దగ్గర నిబంధనలకు విరుద్దంగా మంత్రి డెవలపర్స్ కు 15 అంతస్తుల నిర్మాణాలకు అనుమతిచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీని వెనుక జరిగిన పరిణమాలను రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. తెలంగాణకు తలమానికం కేబీఆర్ పార్క్ అని, కేబీఆర్ పార్కులో నెమళ్లతో పాటు ఎన్నో వన్యజీవులు ఉన్నాయని రేవంత్‌రెడ్డి చెప్పారు. కేబీఆర్ పార్క్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వ సంపదగా గుర్తించిందని, 2006లో ఫైవ్ స్టార్ హోటల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించిందని, పర్యాటకుల కోసం కాంగ్రెస్ ఈ ప్రతిపాదన చేసిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. 3 అంతస్తుల నిర్మాణం కోసమే కాంగ్రెస్ అనుమతి ఇచ్చిందని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని భారీ అంతస్తులకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. 16 మంది సీఎంలు కేబీఆర్ పార్క్ కోసం కఠిన నిబంధనలు పెట్టి పార్కును కాపాడారు అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం పార్క్ చుట్టూ నిర్మాణాలకు ఎన్నో నియమ నిబంధనలు పెట్టిందన్నారు.
మంత్రీ మంత్రాగం..15 అంతస్తులకు అనుమతి
2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేబీఆర్ పార్కు ప్రాంతంలో అన్ని నిబంధనలను అనుసరించి 5 ఎకరాల 30 గుంటల భూమిని ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఐసీఐసీఐ వెంచర్స్, ఎన్సీసీ, మైటాస్ జాయింట్ వెంచర్ గా ఏర్పడి ఈ భూమిని సొంతం చేసుకున్నారు. 2009లో సత్యం స్కాం జరిగిన తర్వాత మేటాస్ కు ఉన్న 15 శాతం వాటాను ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే కంపెనీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత కాలంలో ఐసీఐసీఐ, ఎన్సీసీ కూడా తప్పుకుని అంతిమంగా బెంగుళూర్ కేంద్రంగా ఉన్న మంత్రీ డెవలపర్స్ చేతుల్లోకి ఈ భూమి వెళ్లింది. మంత్రి డెవలపర్స్ 2012 లో ఈ భూమిలో రెసిడెన్షియల్ నిర్మాణానికి జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకోగా... జీ+2 కు అనుమతి వచ్చింది. మరిన్ని ఫ్లోర్లకు అనుమతి ఇవ్వాల్సిందిగా మంత్రీ డెవలపర్స్ కోరినప్పటికీ... ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉన్నందున ఇంతకు మంచి అనుమతి ఇవ్వలేమని అప్పటి ప్రభుత్వం తేల్చే చెప్పింది.
2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత మంత్రీ డెవలపర్స్ తిరిగి అదనపు ఫ్లోర్ల అనుమతి కోసం ప్రయత్నాలు ప్రారంభించి... 2016 లో జీ+7 ఫ్లోర్లకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. 2018 లో మంత్రీ దరఖాస్తుకు మోక్షం లభించింది. అంతటితో తృప్తి పడక తిరిగి 2021 లో మరో ఐదు ఫ్లోర్లకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. దీనికి 2022 లో కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతా సజావుగా కనిపిస్తున్నప్పటికీ తెరవెనుక చాలా పెద్ద బాగోతం జరిగింది. ఇందుకోసం మంత్రీ డెవలపర్స్ తో ఒప్పందం కోసం 2017 మే 16న ఆర్ఎన్ఆర్ డెవలపర్స్ ఎల్ఎల్పీ అనే కంపెనీ సృష్టించింది. వీర వెంకట రామారావు రేమెల్ల, శ్రీ కృష్ణ నాయక్ లు ఆ కంపెనీలో పార్టనర్ లు. ఈ రామారావు రేమెల్ల మూలాలు తవ్వి చూస్తే ఆయన గతంలో సత్యంలో ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా పని చేశాడు. సత్యం కుటుంబానికి అత్యంత నమ్మకమైన, సన్నిహితుడు. వీళ్లు మంత్రి డెవలపర్స్ లో భాగస్వాములు అయ్యారు. వీరు భాగస్వాములు అయ్యాక వేగంగా అనుమతులు వచ్చాయి. ఆర్ఎన్ఆర్, మంత్రీ డెవలపర్స్ మధ్య ఒప్పందం జరిగిన తర్వాత ఫిబ్రవరి 21, 2018 న ఉన్నపళంగా జీ+7 (2012లో ఇచ్చిన జీ ప్లస్ టుకు అదనంగా ఐదు ఫ్లోర్లు) కు జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చేసింది. ఐనా, సంతృప్తి చెందక మరో ఐదు ఫ్లోర్లకు దరఖాస్తు చేసింది. బేస్ మెంట్ 3+ గ్రౌండ్+ 11 ఫ్లోర్లకు అక్టోబర్ 13, 2022 న మరో ఐదు ఫ్లోర్ల నిర్మాణానికి జీహెచ్ఎంసీ అనుమతి ఇచ్చేసింది. దీంతో మొత్తం 15 అంతస్తులకు అనుమతి అనుమతి వచ్చింది. భూమి లోపల ఐదంతస్తులకు అనుమతిచ్చారని.. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.
రాజుల కోసం నిబంధనలు తుంగలో తొక్కారు
ఈ ప్రాజెక్టులో ఒక్కో అపార్ట్‌మెంట్ సగటున 8000 ఎస్ఎఫ్టీతో నిర్మాణం చేపడుతున్నారు. ఇట్లా 200 అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఇంత లగ్జరీ (సుమారు రూ.20 కోట్లకు ఒక అపార్ట్‌మెంట్) అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే వాళ్లు ఇంటికి కనీసం 5 కార్లు ఉంటాయి. ఆ లెక్కన వేసుకుంటే మొత్తం 1000 కార్లు ఈ నిర్మాణంలో ఉంటాయి. ఈ వెయ్యి కార్లు ఉదయం ఒకేసారి బయటకు వస్తే పరిస్థితి ఊహించుకోవచ్చు.
కేబీఆర్ పార్క్ నుంచి 120 గజాల వరకు ఎలాంటి నిర్మాలు చేయకూడదనే నిబంధన ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్కును ఆనుకుని 15 అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తున్నారని తెలిపారు. కేబీఆర్ పార్క్ దగ్గరకు వచ్చే వాకర్స్ అసోసియేషన్ ప్రజాప్రయోజన వాజ్యం వేయాలని కోరారు. అనుకోని ప్రమాదాలు జరిగితే భూమి లోపల ఉండే ఐదంతస్తుల నుంచి ఎవరైనా బయటకు వస్తారా? అని ప్రశ్నించారు.
కేబీఆర్ పార్కుని ఆనుకుని ఉన్న స్థలంలో 15 అంతస్థులకు ఎలా అనుమతి ఇచ్చారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ తన మిత్రుల కోసం, సత్యం రాజుల కోసం నిబంధనలు తుంగలో తొక్కారు. హెరిటేజ్ భవనాలను ధ్వంసం చేస్తున్నారని చర్చ వచ్చినపుడు అసెంబ్లీలో ఆనాడు సంపత్ కుమార్ ను కేసీఆర్ దాబాయించారు. రాష్ట్రంలో ఏం జరిగినా కేసీఆర్ తనకు తెలుస్తుంది అని చెబుతాడు.. మరి జూబ్లీహిల్స్ సర్కిల్ లో జరిగే దోపిడీ కేసీఆర్ కు కనిపించడం లేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మీరు తవ్విన గోతుల్లోనే మిమ్మల్ని పాతిపెడతాం
కేటీఆర్ నగరాన్ని విధ్వంసం చేసి హైదరాబాద్ నగర చరిత్రను కనుమరుగు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో మీరు తవ్విన గోతుల్లోనే మిమ్మల్ని పాతిపెడతామంటూ రేవంత్ ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్సోళ్లకు ఆంధ్రానే దిక్కని.. ఆపై బంగాళాఖాతమేనని రేవంత్ అన్నారు. తనవి రాజకీయ విమర్శలు కాదని.. నగర భవిష్యత్ కోసమే తన తపన అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబ స్వార్థానికి నగరం బలవుతోందని, నిజాం కాలం నాటి భవనాలను కూల్చేందుకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని, యువరాజును ప్రసన్నం చేసుకునేందుకు అక్రమ సంపాదన, కేబీఆర్ పార్క్ లో ఒక పువ్వు తెంపినా శిక్షించే చట్టాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ఎపిసోడ్ ఒకటి అయ్యిందని.. రెండు మూడు రోజులు గ్యాపిచ్చి మరిన్ని వివరాలతో మీడియా ముందుకు వస్తానని చెప్పారు. మంత్రి కేటీఆర్ చేస్తున్న ఈ ఆగడాలను కేసీఆర్ అడ్డుకోవాలని కోరారు. మంత్రి రాజయ్యను బర్తరఫ్ చేసినట్టు మంత్రి కేటీఆర్‌ను కూడా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు అలా చేస్తే కేసీఆర్ కు పాప ప్రక్షాళన జరుగుతుందన్నారు.
ఇది కూడా చదవండి : KTR About Vizag Steel Plant: కేసీఆర్ మాట్లాడితే ఎవరైనా దిగి రావాల్సిందే
రేపు మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష
రేపు మంచిర్యాలలో రాహుల్ పై అనర్హత వేటుకు నిరసనగా సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తున్నాం. దీక్షకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి : Revanth Reddy Slams KCR: రూ. 100 కోట్ల విలువైన ఆస్తిని కేసీఆర్ బెదిరించి లాక్కున్నారు: రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK