అమెరికా గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదా ?

                                                     

Last Updated : Jun 7, 2018, 04:29 PM IST
అమెరికా గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పదా ?

అమెరికా గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూపులు చూస్తున్న భారతీయులకు చేధు వార్త. అర్హత సాధించిన వారందరికీ ఈ ఏడాది గ్రీన్ కార్డు వస్తుందనుకుంటే పొరపాటే. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తాజాగా విడుదల  చేసిన గణాంకాలను చూస్తే మీకే అర్థమౌతుంది. 

యూఎస్‌సీఐఎస్‌ రిపోర్ట్ ప్రకారం 2018 నాటికి సుమారు 3 లక్షల 95 వేల 25 మంది విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాసమైన గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో మూడొంతులకు పైగా భారతీయులే ఉన్నారట. సుమారు  3 లక్షల 06 వేల 601 మంది భారతీయులు గ్రీన్‌కార్డ్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది.

అమెరికా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ దేశానికీ 7 శాతానికి మించి గ్రీన్‌కార్డులు జారీ చేయరాదు. ఈ లెక్కన చూస్తే అర్హులందరికీ ఈ ఏడాదే గ్రీన్ కార్డు రాకపోవచ్చు. వచ్చే ఏడాది అయినా వస్తుందనుకుంటే.. అదీ సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు. తాజా నిబంధనలను బట్టి చూస్తే  అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన  పరిస్థితి రావచ్చు.

గ్రీన్ కార్డు నిబంధనలు మార్పాలని ఏన్నో ఏళ్ల నుంచి భారతీయలతో పాటు పలుదేశాల వారు గళం విప్పుతున్నారు. అయినప్పటికీ అమెరికా ప్రభుత్వం వీరి ఆందోళనను ఏమాత్రం పట్టించుకోవడలేదు. ఈ విషయంలో అమెరికా డెమోక్రట్ పార్టీకి చెందిన సభ్యులు ఈ సమస్యను అమెరికా కాంగ్రెస్ లో లేవనెత్తినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.

Trending News