YSR Kalyanamasthu and Shaadi Tohfa Schemes Status: వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా స్కీమ్ ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు వారి చదువులకు అండగా నిలబడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. పిల్లలు విద్యావంతులు కావాలనే ఆశయంతోనే 10వ తరగతి నిబంధనను తీసుకువచ్చామని.. వయో పరిమితి వల్ల బాల్య వివాహాలు తగ్గుతాయని అన్నారు. జూలై–సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్. అంతకుముందు పిల్లలను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
పేదతల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదవించి.. వారికి గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసి.. వారి వివాహ జీవితాలను మొదలుపెట్టించేందుకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఇవాళ జరుగుతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నేడు ఈ పథకం ద్వారా జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పెళ్లిళ్లకు సంబంధించి 10,511 మంది జంటలను ఆశీర్వదిస్తూ.. వారికి రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల అకౌంట్‌లలోకి జమ చేస్తున్నామని తెలిపారు. ఈ స్కీమ్ కింద ఇప్పటివరకు 3 త్రైమాసికాల్లో మూడు విడతల్లో ఆర్థిక సాయం అందించామని.. ఈ నాలుగో విడతతో కలిపి మొత్తం 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు.
ఈ స్కీమ్‌ను మొదలుపెట్టే సమయంలో టెన్త్ క్లాస్ సర్టిఫికెట్, 18 ఏళ్లు తప్పనిసరి ఎందుకు అని తనతో చాలా మంది అన్నారని.. అందరికీ ఇస్తే ఓట్లు ఎక్కువ వస్తాయని అన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే ఓట్లు, ఎన్నికలు సెకండరీ అని.. నాయకులుగా మన సంకల్పం మంచిదై ఉండాలన్నారు. గత ప్రభుత్వం హయంలో పేదలకు మంచి జరగాలనే ఉద్దేశంతో అడుగులు వేయలేదని.. ఏనాడూ నిజాయితీతో పనిచేయలేదన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఇంగ్లీషు మీడియం చదువులు రావడం.. 6వ తరగతి నుంచి ఏకంగా డిజిటల్ బోధనను క్లాస్‌రూమ్‌లోనే అందుబాటులోకి తీసుకువస్తూ.. ఐఎఫ్‌పీల బోధన కూడా అందుబాటులోకి తీసుకువచ్చి విప్లవాత్మక మార్పులు చేశామన్నారు. పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి పథకం తీసుకువచ్చామన్నారు. ఇంటర్ వరకు పూర్తయిన తరువాత విద్యా దీవెన, వసతి దీవెన అందుబాటులో ఉన్నాయనే ఆలోచనతో ఉన్నత చదువులు చదివిస్తారని అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook