రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు యూటర్న్: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

కాంగ్రెస్ ఉచ్చులో చంద్రబాబు పడ్డారు: రాజ్‌నాథ్ సింగ్

Last Updated : Oct 16, 2018, 06:14 PM IST
రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు యూటర్న్: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

రాజకీయ అవసరాల కోసమే తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నట్లు కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మంగళవారం గుంటూరుకు వచ్చిన ఆయన.. మంగళగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. ప్రపంచంలో బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ అని, పూర్తి మెజారిటీతో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనన్నారు. దేశంలో మూడింట రెండొంతుల భూభాగంపై భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావును కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు.

రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ ఉచ్చులో పడ్డారని, కాంగ్రెస్ ఉచ్చులో పడటమే గానీ బయట పడటం ఉండదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన.. ఏపీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ఏపీకి 8 బెటాలియన్లు మంజూరు చేశామని, విజయవాడ అభివృద్దికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చామని, రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.1500 కోట్లు ఇచ్చామని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.7150 కోట్లు, వెనుకబడ్డ జిల్లాల అభివృద్ధికి రూ.1050 కోట్లు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, జీవీఎల్ నరసింహ రావు, పైడికొండల మాణిక్యాల రావు, ఇతర బీజేపీ నాయకులు, ఐవై కృష్ణారావు, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి పాల్గొన్నారు. 

Trending News