Pawan Kalyan Latest Comments: వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పటం గ్రామంలో రోడ్లు వెడల్పులో భాగంగా ఇళ్ల కూల్చివేతతో నష్టపోయిన బాధితులకు ఆయన రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా సరే.. రాష్ట్రానికి దిశానిర్దేశం చేసే సభకు ఇప్పతం రైతులు తమకు స్థలాన్నిచ్చారని అన్నారు. వారికి అండగా నిలబడతాను అని ఆరోజే చెప్పానని అన్నారు. ప్రభుత్వం విచక్షణా రహితంగా మన భూములు లాక్కున్నా.. సరైనా పారితోషకం ఇవ్వకున్నా, కూల్చేసినా తనకు బాధ కలుగుతుందన్నారు. ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు.
ఇప్పటం గ్రామంలో ఇళ్లు కోల్పోయిన రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ఇది వారి నష్టాన్ని పరిహారం కాదని.. వారికి మేము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నామన్నారు. చాలామంది అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానమని అంటారని.. అధికారంలో లేకపోయినా చేతనైన సాయడమే జనసేన లక్ష్యమన్నారు. ఇప్పటం గ్రామస్థులు తనను సొంతబిడ్డలా ఆదరించి అండగా నిలబడ్డారని.. వారికి కష్టం వస్తే నేనున్నానని భరోసా కల్పించడానికి వచ్చానని చెప్పారు.
'నాకు అండగా ఉన్న ఇప్పటం ప్రజలకు నేను అండగా ఉంటా. పరిహారం ఇవ్వకుండా ఇళ్లు కూలగొట్టడం బాధ కలిగించింది. వైసీపీ గడప కూల్చేదాకా వదిలిపెట్టం. కూల్చివేతలో పద్ధతి పాటించలేదు. అంతా కక్షతో చేశారు. రైతులు తెగువ చూపించి ఉంటే అమరావతి కదిలేది కాదు. ఈరోజు ఇప్పటంలో 39 మంది రైతు కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది వారి నష్టాన్ని పరిహారం కాదు. వారికి మేము ఉన్నామని కల్పించే భరోసా.
వైసీపీ వారు 30 సంవత్సరాలు వారే అధికారంలో ఉండాలని మాట్లాడతారు. జనసేన ప్రజలకు 25 సంవత్సరాల భవిష్యత్తుకు రక్షణ కల్పించాలని పనిచేస్తుంది. వైసీపీకి జనసేనకు ఉన్న తేడా ఇదే. పెన్షన్ రావట్లేదని అడిగితే వారిని బెదిరించడం.. మా సభలకు రాకుండా అడ్డుకోవడం, నామినేషన్లు వేయకుండా దాడులు చేయడం,
రోడ్లు బాలేవని ప్రశ్నించిన వారిని చంపించడం ఆధిపత్య అహంకార ధోరణి. మాది ఆధిపత్య ధోరణి అని డిఫ్యాక్టో సీఎం సజ్జల గారు అంటున్నారు. ఎవరు నోరు తెరచి మాట్లాడకూడదనే అహంకారపు ఆధిపత్య ధోరణి..' అని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.
కోడి కత్తులతో గీయించుకుని డ్రామాలు ఆడలేనని జనసేనాని అన్నారు. అంబేద్కర్, గాంధీ, కన్నెగంటి హనుమంతు గారి లాంటి స్పూర్తితో పనిచేస్తుంటే వైసీపీ వాళ్లకు నచ్చడం లేదన్నారు. ప్రజల కోసం పనిచేసే జనసేన పార్టీని రౌడీ సేన అంటున్నారని.. రోడ్లపై తల్వార్ కత్తులతో తిరిగి దాడులు చేసే వైసీపీని ఏమనాలని ప్రశ్నించారు. ఎంతోమంది కన్నీళ్లు మధ్యన వైసీపీ నాయకులు కోటలు కడుతున్నారని అన్నారు. ఎంత డబ్బు సంపాదించినా పోయేటప్పుడు ఏమి తీసుకెళ్లమని.. నోట్ల కట్టలను తినలేమనే విషయం వైసీపీ నాయకులకు అర్దం కావట్లేదన్నారు.
తన ఇష్టపడే అభిమానులు కూడా గత ఎన్నికల్లో వైసీపీకే ఓట్లు వేశారని.. తనకు ఓటు వేయపోయినా ప్రజల వెంటే ఉంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తన మీద ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు ఢిల్లీ వెళుతున్నారని.. వైసీపీని దెబ్బ కొట్టాలంటే ప్రధానికి చెప్పకుండా యుద్ధానికి దిగుతానని అన్నారు. ఆంధ్రాలో పుట్టా.. ఆంధ్రలోనే తేల్చుకుంటానని అన్నారు. వైసీపీ ప్యూడలిస్ట్ కోటను బద్ధలు కొడతామన్నారు. ప్రతి పథకానికి వైఎస్ఆర్ పేర్లే పెడుతున్నారని.. వైసీపీ వాళ్లకు అవకాశం వస్తే వైఎస్ఆర్ దేశం అని పెడతారేమోనని ఎద్దేవా చేశారు. 175కి 175 సీట్లు వైసీపీ గెలుచుకుంటే.. చూస్తూ కూర్చుంటామా..? అని అన్నారు. వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమని.. వైసీపీ నేతల మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు.
ఆసక్తికర ఘటన:
ఈ సమావేశంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. కూల్చివేతలు జరుగుతున్న సమయంలో తనను బిడ్డా అంటూ అక్కున చేర్చుకున్న ఓ వృద్ధురాలిని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆమెకు పాదాభివందనం చేసి దగ్గరకు తీసుకున్నారు. ఆనాడు తనకు ఇలాంటి తల్లులే అండగా నిలబడ్డారని అన్నారు. అదే తనను కదిలించిందన్నారు. ఇప్పటం గ్రామానికి ప్రభుత్వం గాయం చేస్తే.. తాము మందు రాశామన్నారు.
Also Read: IND vs NZ: హామిల్టన్‌లో భారీ వర్షం.. రద్దైన రెండో వన్డే! 1-0 ఆధిక్యంలో కివీస్
Also Read: Coronavirus Cases: మళ్లీ భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఈ నగరాల్లో లాక్‌డౌన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook