Pawan Kalyan Public Meeting in Visakhapatnam: తాము ఎవ్వరికీ బి పార్టీ కాదని.. తెలుగుదేశం పార్టీ వెనక నడవట్లేదని.. ఆ పార్టీతోపాటు కలిసి నడుస్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నానని.. ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని స్పష్టం చేశారు. పదవుల కోసం తాను ఎప్పుడూ ఆలోచించలేదని.. ప్రజల ప్రేమ, అభిమానంతోనే పార్టీని నడపగలుగుతున్నానని చెప్పారు. విశాఖలో ఎంవీపీ కాలనీలోని ఎఎస్ రాజా గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. విడిపోయి దశాబ్ధం అవుతోందని.. మన రాజధాని ఏది అంటే ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. అత్తారింటికి దారేది అంటే మూడు గంటల సినిమాతో కథ చెప్పవచ్చని.. అయితే రాజధానికి దారేది..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఢిల్లీ నుంచి ఎవరో చెబితేగానీ మనకు తెలియడం లేదన్నారు. 2024లో జనసేన – తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఉత్తరాంధ్ర వలసలను నిరోధించి.. యువతకు చక్కటి ఉపాధి కల్పిస్తామని తెలిపారు.
ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు, యువత జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోవడం బాధ కలిగిస్తోందని.. వచ్చే తరానికి బంగారు భవిష్యత్తు అందించేలా తన వంతు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ప్రాంత యువతకు ఇక్కడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రయత్నిస్తానని చెప్పారు. కొద్ది రోజుల క్రితం మత్స్యకారుల బోట్లు కాలిపోతే బాధితులకు పార్టీ తరఫున రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించామని.. ఆ డబ్బు వాళ్ల కష్టాలు తీరుస్తుందని కాదు.. మీ కష్టంలో మేము అండగా ఉన్నామని భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేశానని చెప్పారు.
"విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం ప్రకటించగానే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో మాట్లాడాను. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇతర రాష్ట్రాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ లాగా చూడకండి. స్టీల్ ప్లాంట్ విశాఖలో ఏర్పాటు చేయడం కోసం 32 మంది బలిదానాలు చేశారు. ప్రతి తెలుగువాడికి చాలా భావోద్వేగంతో కూడుకున్నది. అలాంటి సంస్థను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రంలో చాలా గొడవలు తలెత్తే అవకాశం ఉందని చెప్పాను. జై తెలంగాణ నినాదానికి ఎంత ఉద్వేగం ఉంటుందో 'విశాఖ హక్కు - ఆంధ్రుల హక్కు' అన్న నినాదానికి కూడా అంతే ఉద్వేగం ఉందని చెప్పాను. ఇవన్ని చెబితేనే కేంద్ర పెద్దలు మన మాటలను గౌరవించి ఇంత వరకు
ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు. ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణగా జనసేనకు అండగా నిలబడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా బలమైన పోరాటం చేస్తాం.
వైసీపీ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే.. కనీసం వాళ్లు సకాలంలో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల గురించే తప్ప యువత భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోతున్నారు. నిజమైన రాజకీయ నాయకులు అయితే ఈ ఐదేళ్లు నిరుద్యోగ యువతకు ఎంత విలువైన కాలమో తెలిస్తే తప్పులు చేయరు. జ్యాబ్ క్యాలెండర్ సకాలంలో ఎందుకు విడుదల చేయలేకపోయారో కనీసం జవాబు చెప్పేవారు లేరు. ఏదైనా ప్రవేశ పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వారికి తెలుసు. నేను దశాబ్ధ కాలంగా ఓటమి మీద ఓటమి తీసుకుంటూ ఎదుగుతున్నాను." అని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు పదవి కావాలంటే బీజేపీలో చేరితో ఏదో ఒక పదవి వస్తుందని.. కానీ తాను మార్పు కోరుకుంటున్నానని అన్నారు.
పొత్తులో మద్దతు ఇచ్చిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అన్నది ఆలోచిద్దామన్నారు పవన్. తాను, చంద్రబాబు కూర్చొని దీని గురించి ఆలోచిస్తామని.. మీ గుండెల్లో ఉన్న అభిమానం ఓట్లుగా మారాలన్నారు. "పొత్తును విడగొట్టాలని కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశానికి బీ పార్టీ అంటూ కామెంట్లు చేస్తారు. దానిని మీరు పట్టించుకోకండి. మనం తెలుగుదేశం వెనుక నడవడం లేదు. తెలుగుదేశం పార్టీ పక్కన నడుస్తున్నాం. మనం ఒంటరిగా బరిలోకి దిగితే గతంలో కంటే ఓట్లు శాతం పెరుగుతుంది. అయితే అధికారం తీసుకొచ్చే బలం ఉంటుందో లేదో తెలియదు. యువత భవిష్యత్తు కోసం ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. దశాబ్దంపాటు దెబ్బలు తింటూ వచ్చాను. ఇప్పుడు అడుగుతున్నాను.. జనసేన-తెలుగుదేశం పార్టీలను నిండు మనసుతో గెలిపించండి. మరోసారి వైసీపీ వైపు చూస్తే మీ భవిష్యత్తును మీరే కాలరాసుకున్నట్లే అవుతుంది. వైసీపీకి బై బై చెప్పాల్సిన అవసరం ఉంది." అని పవన్ కళ్యాణ్ అన్నారు.
Also Read: New Ministers History: తెలంగాణా కొత్త మంత్రుల పూర్తి హిస్టరీ..రాజకీయ అరంగేట్రం వివరాలు..
Also Read: CM Revanth Reddy: కొత్త ప్రభుత్వంలో ప్రక్షాళన.. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి