YSRTP Merging In Congress: గత కొన్నిరోజులుగా మీడియా చానళ్లలో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం ఒకసారి, ఆ తరువాత ఆ పార్టీ అధికారం చేపట్టిన అనంతరం మరొకసారి కర్ణాటక పీసీసీ చీఫ్ డికే శివకుమార్ ని కలిసిన వైఎస్ షర్మిల ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే డికే శివకుమార్ తో భేటీ వెనుకున్న అసలు విషయం వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు చర్చించడమే అనే ప్రచారం సాగింది.
రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఇప్పటికే వైఎస్సార్టీపీ విలీనం దిశగా చర్చలు మొదలుపెట్టారని.. వైఎస్సార్టీపీ విలీనం ప్రతిపాదన ప్రస్తుతం చర్చల దశలో ఉందని రకరకాల ఊహాగానాలు తెరపైకొచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలనే ఈ విషయంపై స్వయంగా స్పందించారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన వైఎస్ షర్మిల పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటుందని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఊహాజనిత కథనాలు కల్పిస్తూ, తనకు, తెలంగాణ ప్రజలకు మధ్య అగాధాన్ని సృష్టించేందుకు రాజకీయంగా కుట్రలు జరుగుతున్నాయని వైఎస్ షర్మిల ఆరోపించారు.
వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని…
— YS Sharmila (@realyssharmila) June 23, 2023
" పని లేని, పస లేని వారికి నేను చేప్పేది ఒక్కటే... ఏంటంటే.. నా రాజకీయ భవిష్యత్ మీద పెట్టే దృష్టిని, సమయాన్ని కేసీఆర్ పాలనపై పెట్టండి. అన్ని విధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవిష్యత్తు మీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి అని వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రత్యర్థులకు విజ్ఞప్తిచేశారు. నా భవిష్యత్తు తెలంగాణలోనే... నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే. జై తెలంగాణ" అంటూ సోషల్ మీడియా పోస్టు ద్వారా వైఎస్ షర్మిల వివరణ ఇచ్చారు. తనపై అయితే పార్టీ విలీనం ఒట్టి మాటే అని గానీ లేదా పార్టీని కొనసాగిస్తాను అని కానీ వైఎస్ షర్మిల తన పోస్టులో ఎక్కడా పేర్కొనకపోవడం కూడా పలు అనుమానాలకు బలం చేకూరుస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.