Pawan Kalyan's Speech From His Varahi Yatra in Visakhapatnam: విశాఖపట్నం: ‘జగన్ అనే వ్యక్తి నాయకుడు కాదు... అతనో వ్యాపారి మాత్రమే. కమీషన్లు తీసుకొనే తరహా. ఎవరైనా పరిశ్రమ స్థాపించాలని వస్తే ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అని జగన్ అడగడు.. నాకేంటి అంటాడు. 30 శాతం ఇస్తావా 40 శాతం ఇస్తావా అని వాటాలు, కమీషన్లు అడిగే వ్యాపారి అతను’ అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో వారాహి విజయ యాత్ర సభను నిర్వహించారు. వారాహి నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ “గతంలో గంధపు చెక్కల దొంగ వీరప్పన్ ఉండేవాడు. గంధపు చెట్లను నరికించేందుకు కూలీలను సిద్ధం చేసుకొని, వారితో చెట్లను కొట్టించేవాడు. తను మాత్రం పైనుంచి అంతా పర్యవేక్షించేవాడు. వీరప్పన్ మాదిరిగా జగన్ తయారయ్యాడు. తప్పులను అధికారులతో, వాలంటీర్లతో, అనుచరులతో చేయిస్తూ పైన తన లబ్ధి పొందుతాడు. ఇదో జగన్ మార్కు పద్ధతి విధానం. జగన్ కి డబ్బు సంపాదన అనేది ఒక పిచ్చి. ఓ మనిషికి డబ్బు అనేది మొదట ఆశ. బాగా సంపాదించాలి... కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సాధ్యమైనంత పొదుపు చేసి, భవిష్యత్తు తరాలకు ఉంచాలి అనుకుంటారు. అది తర్వాత అలవాటుగా మారుతుంది. డబ్బు సంపాదించడం అలవాటుగా మారితే డబ్బు సంపాదించడమే వ్యాపకం అయిపోతుంది. అదే జీవితంగా మారుతుంది.. ఆ స్టేజీ కూడా దాటి డబ్బు సంపాదించడం వ్యసనంగా కింద మారితే మాత్రం ప్రమాదకరం. డబ్బు సంపాదన కోసం ఇతరుల్ని పీడించడం, వేధించడం మొదలు అవుతుంది. డబ్బు వస్తుంది అంటే దేనికైనా తెగించడానికి సిద్ధపడతారు అని చెబుతూ జగన్ ఈ స్టేజీలన్నీ ఎప్పుడో దాటేశారు అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. జగన్ కు డబ్బు అంటే పిచ్చి. విపరీతమైన పిచ్చి. సంపాదించిన దాన్ని ఏం చేసుకుంటారో కూడా తెలియని పిచ్చి. కరెన్సీను తాలింపు వేసి అన్నంగా కలుపుకొని తింటాడేమో తెలియదు కానీ.. దాన్ని సంపాదించేందుకు తన, మన అనే బేధం కూడా చూడడు. ఇప్పుడు ఆ పిచ్చే ఆంధ్ర ప్రజలను పట్టి పీడిస్తోంది అని ఆవేదన వ్యక్తంచేశారు.
జగన్ వచ్చి మిమ్మల్ని అన్న.. అక్క అన్నాడంటే జాగ్రత్త
జగన్ అన్న, అక్క అనగానే అధికారులు ఉబ్బితబ్బిబ్బవ్వొద్దు. జగన్ ప్రతి పదం వెనుక అక్కడున్న పరిస్థితిని బట్టి అందరినీ అన్న, అక్క అని సంబోధించడం ఓ రకమైన మైండ్ గేమ్. జగన్ అన్న, అక్క అనగానే అధికారులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమను అన్న అని పిలిచాడనో, అక్క అని అన్నాడనో ఆనందపడొద్దు. తర్వాత మీ దగ్గరకు ఓ కీలకమైన ఫైల్ పంపి ‘అన్న.. దాన్ని కాస్త సంతకం పెట్టన్నా’ అంటాడు. ఓ చట్ట వ్యతిరేకమైన పని చేయిస్తూ మనోళ్లదే కాస్త చేసి పెట్టన్నా అంటాడు. అది గమనించండి. జగన్ మాట్లాడే ప్రతి మాట వెనుక అతడి స్వార్థ ప్రయోజనాలు దాగుంటాయి. అతడు కలిపే ప్రతి వరుస వెనుక లోతైన అర్ధాలు ఉంటాయని మర్చిపోకండి. అన్న అని తప్పుడు పనులు చేయించడం, అక్క అని రాజ్యాంగ విరుద్ధమైన చర్యల్లోకి లాగడం జగన్ కు బాగా తెలుసు. గతంలోనూ అతడి బారిన పడిన ఎందరో ఉన్నతాధికారులు జైళ్లకు వెళ్ళి ఇప్పటికీ కేసుల్లో ఉన్నారన్న సంగతిని గుర్తు పెట్టుకోండి. జగన్ కలిపే వరుసల వలలో మాత్రం పడకండి. దీని వల్ల భారీ మూల్యం చెల్లించుకుంటారు.
వాలంటీర్లలో ప్రమాదకరమైన వ్యక్తులున్నారు
వాలంటీర్లు నా సోదరులు, సోదరీమణులు లాంటి వారు. సింహాచలం అప్పన్న సాక్షిగా చెబుతున్నాను.. నాకు వాలంటీర్ల మీద ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదు. ఉన్నత చదువులు చదివి కేవలం రూ.5 వేలకు పని చేస్తున్న వారికి అవసరం అయితే మరో రూ.5 వేలు ఇవ్వాలని భావించేవాడిని తప్ప పొట్ట కొట్టాలని అనుకునేవాడిని కాదు. అయితే జగన్ వాలంటీర్లతో చేయిస్తున్న తప్పుడు పనులు మీదనే నేను మాట్లాడాను. నేటి ఆధునిక కాలంలో వ్యక్తిగత సమాచారం అనేది ఎంత కీలకమో, దాన్ని జగన్ వాలంటీర్ల ద్వారా సేకరించి, దేనికి వాడుతున్నాడనే దానిపైనే నా అభ్యంతరం. వాలంటీర్ల మీద నేను ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడను. కేంద్రం నుంచి వచ్చిన సమాచారం, నివేదికలు ఆధారంగానే మాట్లాడుతాను. పెందుర్తిలో 70 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసి, బంగారు కాజేసిన వాలంటీరు ఒకరైతే... కొయ్యలగూడెంలో చదువురాని మహిళ అకౌంట్లోని రూ.1.50 లక్షలను ఫోర్జరీ చేసి డబ్బులు కాజేసిన వాలంటీరు మరొకరు. ఇలా రోజుకో వాలంటీరు నేరాలు బయటపడుతున్నాయి.
తిరుపతి ఎస్పీ ఏం సమాధానం చెబుతారు?
వాలంటీర్లలో అందరినీ నేను అనను. వారిలో ఉన్న కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తోంది. సేకరిస్తున్న సమాచారం సైతం వాలంటీర్లకు ఎటు వెళ్తుందో తెలియడం లేదు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కీలకమైన ఆధార్ సమాచారంతో సహా అన్నీ సేకరిస్తున్నారు. ఇటీవల ప్రజల ఫోన్లకు వచ్చే అత్యంత గోప్యమైన ఓటీపీ నంబర్లను సైతం అడిగే పరిస్థితికి వాలంటీర్లు వెళ్లిపోయారు. చిత్తూరులో ఓ యువకుడు తనకు రేషన్ రాలేదని అడిగిన పాపానికి అతడి ఇంటిని వాలంటీర్లు తగులబెట్టారు. నేను ఇటీవల తిరుపతి ఎస్పీని కలిసేందుకు వెళితే, వాలంటీర్ల మీద అలా ఎలా మాట్లాడతారని ఆయన అడిగారు. మరీ రోజుకో నేరంలో బయటపడుతున్న వాలంటీర్ల గురించి తిరుపతి ఎస్పీ ఏమని సమాధానం చెబుతారు..?
జగన్ అనే వ్యక్తి నాయకుడు కాదు ముమ్మాటికీ వ్యాపారి. కమీషన్ ఏజెంట్. ఎవరైనా పారిశ్రామికవేత్త పరిశ్రమ పెట్టాలని రాష్ట్రానికి వస్తే నాకేంటి అని అడుగుతాడు. వేలకోట్లు డబ్బులు దోచుకోని ఏం చేసుకుంటావు జగన్ ? డబ్బంతా ఒకరి దగ్గర పేరుకుపోతే ప్రజల్ని బానిసలుగా చూస్తారు. పనిపాట లేకుండా డబ్బు వచ్చి పడితే మనం ఎలా బతకాలో వాడు డిసైడ్ చేస్తాడు. ఇలాంటి వ్యక్తులపై ఒక కన్ను వేయకపోతే మనకు ముద్ద కూడా మిగలనివ్వరు. బొగ్గును ఎంత సర్ఫ్ పెట్టి తోమినా రంగు మారదు. జగన్ కూడా అంతే. ఆయన వేల, లక్షల కోట్లు సంపాదించిన డబ్బు పిచ్చి పోదు. ఇంకోసారి అని ఆయనకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఇక ఎవడూ కాపాడలేడు. రూ. 60 ఉన్న క్వాటర్ ను రూ. 160 చేశాడు. మద్యపాన నిషేదం అని చెప్పి మద్యం అమ్మకాలపై రూ. 30వేల కోట్లు దోచేశాడు. ఆ డబ్బునే రేపు మీ ఓట్లు కొనడానికి ఉపయోగిస్తాడు. సారా నుంచి సిమెంట్ వరకు అన్ని ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఈసారి ఆయన అధికారంలోకి వస్తే ఇంటికి మామిడి తోరణాల బదులు జిల్లేడు తోరణాలు కట్టుకోవాలి.
ఏ ఫర్ ఆల్కహాల్ ... బీ ఫర్ బాంబ్.. సీ ఫర్ ఛీటింగ్
జగన్ మాట్లాడితే అమ్మఒడి అని అంటాడు. ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మఒడి ఇస్తామని చెప్పారు. తరువాత మాట మార్చి కుటుంబంలో ఒకరికే అని మెలిక పెట్టారు. ఇప్పుడు ఆ ఒక్కరికి ఇవ్వడానికి రకరకాల కారణాలతో అర్హులను జాబితా నుంచి తొలగిస్తున్నారు. ప్రచారం కోసం వేసిన అమ్మఒడి పోస్టర్ లో జగన్ పిల్లలతో ఏదో రాయిస్తున్నట్లు ఉంటుంది. రాష్ట్రంలో పరిస్థితి బట్టి ఆయన ఏ అంటే అల్కహాల్, బి అంటే బాంబ్, సి ఛీటింగ్ అని భవిష్యత్తు తరాలకు రాయిస్తున్నట్లు అనిపిస్తోంది. వైసీపీ హయాంలో దాదాపు మూడు లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు. 50 వేలు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మాట్లాడితే మెగా డీఎస్సీ తీస్తామని గొప్పలు చెప్పే ఈ ప్రాంతం మంత్రి గారు నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు దానిని పూర్తి చేయలేక పోయారు. విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం డబ్బులు విడుదల చేయని ఈ ప్రభుత్వం... బైజూస్ సంస్థకు మాత్రం రూ. 500 కోట్లు ఇస్తుంది.
వ్యక్తికి కట్టుబడి పనిచేస్తున్నారు
జగన్ కు పాలించమని అధికారం ఇస్తే ప్రజలను పీడిస్తున్నాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలని మాటలు చెప్పి కీలకమైన పదవులను ఒకే కులంతో నింపేశాడు. పదవులన్ని ఒకే కులానికి కట్టబెడితే వాళ్లు రాజ్యాంగానికి కాకుండా వ్యక్తికి, కులానికి కట్టుబడి పనిచేస్తారు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే కీలమైన పదవుల్లో అన్ని కులాలకు ప్రతినిధ్యం కల్పిస్తాం. చిన్న పాటి ప్రభుత్వం ఉద్యోగానికి దరఖాస్తు పెట్టాలంటే పోలీసు కేసులు ఉన్నాయా? లేదా? అని చూస్తారు. జగన్ మీద 38 కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ప్రజలను, అవినీతి నిరోదక శాఖను నియంత్రిస్తున్నాడు. దోపిడీలు, దౌర్జన్యాలు, స్కాంలు చేసిన వారిని రాజ్యాధికారంలో కూర్చొబెట్టి తప్పు మనం చేశాం. రాష్ట్రం కోసం బలిదానాలు చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి లాంటివారికి విగ్రహాలుపెట్టరుగానీ రాష్ట్రాన్ని దోచుకున్న వైఎస్సార్ లాంటివారికి ఊరూరా విగ్రహాలుపెట్టారు.
ప్రతి వ్యక్తి జీవితంలో 5 సంవత్సరాలు చాలా కీలకం. ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం ఆలోచించకుండా మనం ఓటు వస్తే, 5 ఏళ్ల పాటు మన తలరాతల్ని రాసే అధికారం ఇచ్చినట్లే. అది ఎంతటి విపరిణామాలకు దారి తీస్తుందో, మనం ఎలా వెనుకబడతామో ఆంధ్ర ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలి. ప్రకృతి వనరులు అనేవి జగన్ సొంత ఆస్తులు కావు.. అవి ఉమ్మడి ఆస్తులు. జగన్ తన సామ్రాజాన్ని పెంచుకునేందుకు దేనికైనా తెగిస్తాడు. ఆంధ్ర తన నేల అయినట్టు, ప్రజలంతా బానిసలుగానే అతడి ఆలోచనలు ఉంటాయి. పోలీసులు దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరినీ భయపెట్టి పాలన సాగించాలనే మనస్తత్వం ఉన్న వాడు జగన్. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయడం జగన్ కు తెలియని పని.
ఇది కూడా చదవండి : Pawan Kalyan About Vizag: విశాఖపట్నం నాకు అన్నం పెట్టింది.. పవన్ ఎమోషనల్ స్పీచ్
తాను ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం, హక్కుల కోసం పోరాడేవాడిని. 2014లో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినా, తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో బయటకు వచ్చి టీడీపీని నిలదీశాను. శ్రీ నరేంద్ర మోదీ గారి వంటి పెద్దలతో సన్నిహిత పరిచయం ఉన్నప్పటికీ, ప్రత్యేక హోదా గురించి బీజేపీతోనూ విభేధించాను. నాకు ప్రజల సంక్షేమం మాత్రమే ప్రధాన ఏజెండా. వారి గురించి మాత్రమే నా ఆలోచన. ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెబుతున్నాను అంటే వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే జరిగే దుష్పరిణామాలు మన ఊహకు కూడా అందని విధంగా ఉంటాయి. ఈ కారణంతోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెబుతున్నాను. మరోసారి వైఎస్ జగన్ అధికారం చేపడితే ఆంధ్రాను ముక్కలుగా చేసి అమ్ముకుంటారు. ఇదీ సత్యం’’ అన్నారు.
ఇది కూడా చదవండి : Bhola Shankar: భోళాశంకర్ సినిమా టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం నిర్ణయమిదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి