కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) రేసులో ముందు మేమే అంటూ సంచలనం సృష్టించిన రష్యా ( Russia ) ఇప్పుడు మరో ఖ్యాతిని కైవసం చేసుకుంటోంది. రెండవ కరోనా వ్యాక్సిన్ తయారీకు ఆ దేశం సిద్ధమవుతోంది. రష్యన్ రెగ్యులేటరీ ( Russian Regulatory ) దీనికి సంబంధించి అనుమతులు జారీ చేసింది.
స్పుత్నిక్ వి ( Sputnik v vaccine ) . రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్. ప్రపంచంలో అందరికంటే ముందుగా రిజిస్టర్ చేయడమే కాకుండా..వ్యాక్సిన్ పంపిణీ కూడా ప్రారంభించేసింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు చేయకుండానే రిజిస్టర్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు తలెత్తాయి. రష్యా వ్యాక్సిన్ ( Russia vaccine ) సామర్ధ్యంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందేహాలకు చెక్ పలికేందుకు రష్యా మూడో దశ ప్రయోగాల్ని భారీగా అంటే ఏకంగా 40 వేల మందిపై ప్రారంభించింది.
ఇటీవలే స్పుత్నిక్ వి వ్యాక్సిన్ పంపిణీకు సిద్ధంగా ఉందని కూడా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ కోసం భారతదేశ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ( Dr Reddys laboratories ) తో ఒప్పందం కూడా జరిగింది. ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ( Russia president Vladimir putin ). కోవిడ్ 19 రెండవ వ్యాక్సిన్‌కు రష్యా రెగ్యులేటరీ అనుమతి ఇచ్చినందుకు సంతోషంగా ఉందని ఓ ప్రభుత్వం సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.
వ్లాదిమిర్ పుతిన్ చెబుతున్న ఈ రెండవ కరోనా వ్యాక్సిన్ ను సైబీరియాకు చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్ ( Vector institute ) అభివృద్ధి చేసింది. గత నెలలో ప్రారంభ దశ మానవ పరీక్షలను పూర్తి చేసినందుకు పుతిన్ శాస్త్రవేత్తలను అభినందించారు. ఇక మొదటి, రెండవ వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి విదేశీ భాగస్వాములతో కూడా పనిచేస్తున్నామనీ, విదేశాలకు సైతం తమ టీకాను అందిస్తామని చెప్పారు.
అమెరికా, ఇండియా, బ్రెజిల్ దేశాల అనంతరం అత్యధిక కరోనా వైరస్ కేసులున్న దేశం రష్యా. ఈ దేశంలో 13 లక్షల 40 వేల కేసులు నమోదయ్యాయి. Also read: WW II Bomb: ప్రమాదవశాత్తు పేలిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు