నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరిశీలించేందుకు సీపీఐ నేత నారాయణ వినూత్న ధోరణి ప్రదర్శించారు. తన సహచర సీపీఐ నేతలతో కలిసి సైకిల్ యాత్ర నిర్వహించారు. రాజధాని నిర్మాణం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు ఆలోచనలు ఆచరణ సాధ్యమా !
అమరావతి నిర్మాణంలో చంద్రబాబు ఆలోచన అద్భుతంగా ఉందని..అయితే అవి ఆచరణలో సాధ్యకాక పోవచ్చని సీపీఐ నారాయణ అభిప్రాయపడ్డారు. గురువారం నారాయణ తన సహచర సీపీఐ నేతలతో కలిసి ఏపీ సచివాలయాన్ని చూసేందుకు సైకిల్ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో ముచ్చటించారు. ‘చంద్రబాబు ప్లాన్ అయితే బాగుంది.. రోడ్లు దీర్ఘకాలికంగా ఉండేలా వేస్తున్నారు.. ఆయన ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కాకపోవచ్చు.. ’ అని వ్యాఖ్యానించారు.
రాజధాని కోసం మట్టి నీరు ఇస్తే సరిపోతుందా ?
ప్రధాని మోడీ పై నారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికి.. రాజధాని నిర్మాణం కోసం మట్టి నీరు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పోలవరం విషయంలో మాట్లాడేందుకు ఏపీ ముఖ్యమంత్రికి ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. అలాగే 2019 కల్లా పోలవరం నిర్మించాలని ఈ సందర్భంగా నారాయణ డిమాండ్ చేశారు.
మోడీ భయం వీడితేనే పనులు జరుగుతాయ్..
ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లకు మోడీ భయం పట్టుకుందని నారాయణ ఎద్దేవ చేశారు. ఆయనకు భయపడే ఇరువురు నేతలు రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టే విషయంలో సైలెంట్ గా ఉంటున్నారని.. భయపడి, బతిమలాడితే నిధులు రావు..పోరాడితే నిధులు వస్తాయని నారాయణ అన్నారు.
ఏపీ రాజధానిలో సీపీఐ నారాయణ హల్ చల్