ఢిల్లీలో వరద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో యమునా నది పొంగి పొర్లుతోంది. హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో యమునా నది ఒక్కసారిగా ప్రమాద స్థాయి దాటింది. నీటి మట్టం ప్రమాద స్థాయిని దాటడంతో ఢిల్లీ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పాత ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదీ జలాల స్థాయి ఆదివారం ఉదయం 205.44 మీటర్లకు చేరుకుందని అధికారులు వెల్లడించారు.
#Delhi: Yamuna river continues to flow above danger mark; Visuals from Old Iron Bridge pic.twitter.com/9i1rwqvyTt
— ANI (@ANI) July 29, 2018
ఢిల్లీ అధికారులు ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన 500 మందికిపైగా ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉదృతి పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం అరవింద్ క్రేజీవాల్ సమీక్షిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు ఢిల్లీ సర్కార్ పడవలను, మర బోట్లను కూడా సిద్ధం చేసుకుంది. వరద నీరు ఢిల్లీలో ప్రవేశించే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1077కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సీఎం సూచించారు.