Tirumala Rains: మారిన వాతావరణంతో తిరుమలలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. కురుస్తున్న భారీ వర్షానికి తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు కొంత ఇబ్బందులు పడుతున్నా.. మంచుదుప్పటిలో మునిగిన తిరుమల అందాలను ఆస్వాదిస్తున్నారు. వర్షాలతో ఈ చలికాలం ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోయాయి. ప్రస్తుతం అక్కడ 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. చలికితోడు వర్షాలతో తిరుమల అందాలు రెట్టింపయ్యాయి. పచ్చని అడవి అందాలు భక్తులను మైమరిపిస్తున్నాయి.
Also Read: Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు
తిరుమలలో సోమ, మంగళ, బుధవారం మూడు రోజులు వర్షాలు పడ్డాయి. దీంతో తిరుమల గిరులు వరదతో నిండిపోయాయి. అన్ని రోడ్లు వరదతో నిండిపోవడంతో జలసవ్వడి నెలకొంది. భారీగా కురిసిన వర్షానికి నాలుగు మాఢ వీదులు జలమయమయ్యాయి. ఆలయంలో కొద్ది పాటి వరద నీరు చేరుకుంది. స్వామి వారి దర్శనానికి వెళ్లిన భక్తులు, దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిచి ముద్దయ్యారు.
Also Read: AP Rains: ఏపీలో కుండపోత వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..
స్వామి వారి దర్శనం తరువాత వెలుపలకు వచ్చిన భక్తులు తమ గదులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా మారిపోయింది. అయితే వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు తిరుమల కొండల అందాలను చూసి తనివి తీరుతున్నారు. ఇక గదులు దొరకని భక్తులు ఆరు బయటే చలిలో గజగజ వణుకుతూ ఉండిపోయారు. టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు.
వర్షాలకు అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. రెండో ఘాట్ రోడ్డులో కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. రెండో ఘాట్ రోడ్డులోని రెండో మలుపు సమీపంలో రోడ్డుకు అడ్డంగా బండరాళ్లు, భారీ వృక్షాలు విరిగిపడడతో వెంటనే విపత్తు నిర్వహణ సిబ్బంది వచ్చి తొలగించే పనిలో మునిగారు. దీని కారణంగా కొంత వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దర్శనానికి సమయం..
వర్షాలు కురుస్తున్నా కూడా భక్తుల సంఖ్య తగ్గడం లేదు. తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం అవుతోంది. ఎస్ఎస్డీ టైమ్ స్లాట్ టోకన్ దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. మంగళవారం 61,446 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 21,374 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి