మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు మాజీలు, కొత్త నాయకులను చేరికలతో తమ పార్టీ క్యాడర్‌ను పటిష్ట పరుచుకొనేందుకు సిద్ధమయ్యారు. అసంతృప్తితో, కొన్నేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న నాయకులు ప్రస్తుతం మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలంగా మారాలని నిర్ణయింయుకొని వివిధ పార్టీల్లో చేరుతున్నారు.
ఏపీలో ప్రస్తుతం జనసేనలో భారీగా నాయకులు చేరుతున్నారు. కేడర్ పెద్దగా లేని జనసేనలో తాజాగా ఉమ్మడి ఏపీ సీఎం నాదెండ్ల మనోహర్ చేరిన విషయం విదితమే. ఆతర్వాత టీటీడీ మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చేరారు. తాజాగా సినీ హీరో నితిన్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు, జనసేనాని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నితిన్ జనసేన కండువా కప్పుకోనున్నారని, రానున్న తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల్లో నితిన్‌తో ప్రచారం చేయించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని ఆ వార్తల సారాంశం. నితిన్ తెలంగాణకు చెందినవాడు కావడంతో పవన్ ఆ మేరకు ఎన్నికల ప్రచారం చేయంచనున్నారట. అయితే నితిన్ పార్టీలో ఎప్పుడు చేరుతారు? అనే దానిపై ఆ వార్తలు సమాచారం ఇవ్వలేదు. బహుశా! దీపావళిలోగా ఏదైనా సమాచారం రావచ్చని సోషల్ మీడియాలో ఈ వార్తను చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.