TDP Politics: టీడీపీలో యనమల చిచ్చు.. కారణం అదేనా?

Yanamala Ramakrishnudu: తెలుగుదేశం పార్టీలో ఆయనో సీనియర్‌ లీడర్‌..! చంద్రబాబు తర్వాత.. నెంబర్‌ 2- గా కొనసాగుతున్నారు..! తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించారు. కానీ ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారా..! తనకు మంత్రి పదవి రాలేదని రగిలిపోతున్నారా..! అందుకే ఆ నేత విసిరినా లేఖాస్త్రం కూటమి పార్టీలో రచ్చ రాజేస్తోందా..! 

Written by - G Shekhar | Last Updated : Dec 11, 2024, 08:30 PM IST
TDP Politics: టీడీపీలో యనమల చిచ్చు.. కారణం అదేనా?

Yanamala Ramakrishnudu: టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. తనకు పార్టీలో ఏ పదవి రాలేదన్న ఆవేదన ఆయనలో మరింత తీవ్రమైనట్టు కనిపిస్తోంది. తనకు తాజాగా తనకు దక్కాల్సిన పదవిని తెలంగాణకు చెందిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ఎగిరేసుకుపోయారని యనమల గరంగరం అవుతున్నట్టు సమాచారం. అందుకే ఆయన సీఎం చంద్రబాబుకు లేఖాస్త్రాన్ని సంధించడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లేఖలో యనమల సొంత పార్టీ లీడర్లను టార్గెట్‌ చేయడం, కులాల పేర్లు ప్రస్తావించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కాకినాడ సెజ్‌, ఇతర పరిశ్రమల పేరుతో పెద్ద ఎత్తున భూములు లాక్కుకున్నారని, అటు బీసీలను రాజకీయంగా, ఆర్ధికంగా తీవ్రంగా దెబ్బతీశారని ఆరోపించడం సంచలనంగా మారింది. మరోవైపు పలువురు వ్యాపారవేత్తల పేర్లను కూడా యనమల ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. స్పాట్‌..
 
ఇక యనమల రామకృష్ణుడు తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబుతో దాదాపు మూడు దశాబ్ధాలుగా కలిసి నడుస్తున్నారు. గతంలో చంద్రబాబు కేబినెట్‌లో యనమల అనేక మార్లు మంత్రి పదవులు చేపట్టారు. అటు ఆర్థికమంత్రిగా ఎక్కువసార్లు  బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత యనమలకే దక్కింది. కానీ ఇప్పుడు మాత్రం యనమల సీఎం చంద్రబాబుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. యనమల కొద్దిరోజులుగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. కానీ మంత్రివర్గంలో నారా లోకేష్‌ తనదైన మార్క్ చూపించడంతో సీనియర్ నేతలు ఎవ్వరికీ కూడా మంత్రి పదవులు దక్కలేదు. ఇందులో యనమల కూడా ఉన్నారు. కానీ తాజాగా రాజ్యసభకు తనను పంపిస్తారని ఆయన పడ్డారని తెలుస్తోంది. కానీ యనమలకు ఆర్‌. కృష్ణయ్య రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు టాక్‌. ఇప్పుడు తనకు దాక్కాల్సిన పదవిని ఆర్‌ కృష్ణయ్య ఎగిరేసుకుపోవడంతో పార్టీపై యనమల తిరుగుబాటు చేసినంతా పనిచేశారని టాక్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం మాజీమంత్రి యనమల రామకృష్ణుడి లేఖాస్త్రం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. యనమల తీరుపై సొంత పార్టీ లీడర్లే గుస్స అవుతున్నారు. రాష్ట్రంలో కమ్మ, వైశ్య సామాజిక వర్గాల మనోభావాలను మాజీమంత్రి యనమల రామకృష్ణుడు దెబ్బ తీశారంటూ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం నిప్పులు చెరిగారు. కాకినాడ సెజ్ లో బీసీలకు అన్యాయం జరిగిందని సీఎం చంద్రబాబుకు యనమల రాసిన లేఖపై రెడ్డి సుబ్రహ్మణ్యం స్పందించారు. కాకినాడ సెజ్ లో బీసీ రైతులకు అన్యాయం జరిగి ఉంటే యనమల నేరుగా సీఎం చంద్రబాబుతో మాట్లాడకుండా కులాల పేరుతో లేఖ రాయడం సబబు కాదన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న యనమల ఏనాడూ బీసీల ఉద్యమాల్లో పాల్గొనలేదని విమర్శించారు.

మరోవైపు యనమల లేఖాస్త్రంపై పార్టీలోని మరికొందరు నేతలు కూడా ఫైర్‌ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు పొందినన్నీ ప్రయోజనాలు ఇంకెవరూ పొందలేదని గుర్తు చేశారు. యనమల కూతురు ఎమ్మెల్యే, అల్లుడు ఎంపీ అయ్యారని చెబుతున్నారు. ఇన్నాళ్లు పదవులన్నీ అనుభవించి.. ఇప్పుడు మాత్రం బీసీ రాగం ఆలపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఏదైనా విషయం ఉంటే అపాయింట్మెంట్ కూడా లేకుండా చంద్రబాబుతో నేరుగా లేదా ఫోన్ లో మాట్లాడే అవకాశం యనమలకు ఉంది. తరచూ వారిరువురు చర్చించుకుంటారు. అలాంటిది యనమల ఇలా లేఖ ఎందుకు రాశారని ప్రశ్నిస్తున్నారు. ఆయనలో ఆ స్థాయిలో అసంతృప్తి ఎందుకని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారట.

మొత్తంగా సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు పెద్దపీట వేస్తున్నట్టు.. తనకు ప్రాధాన్యత తగ్గినట్లు యనమల భావిస్తున్నారా అనే చర్చ సైతం లేకపోలేదు. జగన్ అండ్ కో నుంచి పోర్టు లాగేసుకున్నారని దానిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడం యనమలకు ఇష్టం లేదనే చర్చ సైతం జరుగుతోంది. అందుకే ఆయన లేఖాస్త్రాన్ని సంధించి ఉండొచ్చని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు. మొత్తంగా యనమల లేఖపై కమ్మ సామాజికవర్గం నేతలు తీవ్రంగా మండిపడుతున్నట్టు తెలుస్తోంది.

Also Read: Facial Attendance: తెలంగాణలో కొత్త నిబంధన, రేపట్నించి ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్
Also Read: Mohan Babu Vs Manchu Manoj: మోహన్ బాబుకు బిగ్ రిలీఫ్.. కీలక ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News